Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య కండువా వార్ కొనసాగుతుంది. ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులు బలవంతంగా కండువా కప్పి, దాన్ని ఫొటోలు తీసి... తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని పలువురు బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు కారణంగా తాము పార్టీ మారలేదని వివరణ ఇచ్చుకోవలసి వస్తుందని వాపోతున్నారు. గతకొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజునాయక్ ఇదే విషయంలో మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని... ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులు బలవంతంగా మెడలో కండువా వేసి, ఫోటోలు తీసి పార్టీ మారినట్టు ప్రచారం చేసారని వాపోయాడు. తాజాగా మధురానగర్ కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు.
Also Read : చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం: మాజీ కార్పొరేటర్ సాయిబాబా
తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ మారినట్టు వస్తున్న ప్రచారం అవాస్తవమని వార్డు కమిటీ మెంబర్ అంజమ్మ, బీఆర్ఎస్ నాయకురాలు బాలామణిలు ప్రకటించారు. ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ను కలిసిన అంజమ్మ, బాలామణిలు బీఆర్ఎస్ కండువా వేసుకొని తాము పార్టీ మారలేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం మధురానగర్ కు ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తమ ఇంటికి వచ్చి అకస్మాత్తుగా మెడలో కండువా వేసి తాము పార్టీ మారినట్టు ప్రచారానికి తెరతీశారని వాపోయారు. తమకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాము ఎప్పటికి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. ఈ విషయాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.
Admin
Ekaburu