Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : గోవన్ పల్లిలోని పురాతన రంగనాథస్వామి దేవాలయం మాన్యం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే ఎకరాల కొద్దీ రంగనాథుడి భూములు కబ్జాకు గురికాగా, ఉన్న భూములను సైతం రహదారి కోసం చెరపట్టేందుకు ఓ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తుంది. ఏకంగా రంగనాథుడి మాన్యం భూముల మద్యలో నుంచి నిర్మాణ సంస్థ రహదారి నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. గత మూడు నెలల క్రితం రాత్రికి రాత్రే సిసి రోడ్డు నిర్మాణం చేపట్టగా, దేవాదాయ శాఖ అధికారులు రోడ్డును మొత్తం పెకిలించారు. తాజాగా సదరు నిర్మాణ సంస్థ పలువురు నాయకులకు డబ్బుల ఎరచూపి మరోసారి గుట్టుచప్పుడు కాకుండా రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే విషయం ప్రస్తుతం గోపన్ పల్లిలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
Also Read : అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం
శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలో దాదాపు 500 సంవత్సరాల పురాతన రంగనాథ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం మాన్యం కింద గోపనపల్లి వ్యాప్తంగా 40 ఎకరాల పైచీలుకు భూములు ఉన్నాయి. దేవుని మాన్యం భూముల్లో కొంత అన్యాక్రాంతానికి గురికాగా ఉన్న భూములను రక్షించేందుకు గ్రామస్థులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. గోపనపల్లి గ్రామ సర్వే నెంబరు 268లో సైతం 13.18 ఎకరాల దేవుని మాన్యం భూమి ఉంది. కాగా ఈ భూమిలో సైతం కొంతభాగం కబ్జాకు గురికాగా ఉన్న భూమి మీద ప్రస్తుతం కబ్జాదారుల కన్నుపడింది. ఈ భూమిని ఆనుకొని ఉన్న ఉస్మాన్ నగర్ గ్రామ పరిధిలో వలు భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు వెలిశాయి. ఇందులో ఓ నిర్మాణ సంస్థ ఐటి కారిడార్ వైపు నుంచి దగ్గరి దారికోసం ప్రయత్నిస్తూ రంగనాథుడి మాన్యం భూముల మీద కన్నేసింది. గత మూడు నెలల క్రితం రాత్రికి రాత్రే దేవుని మాన్యం భూముల మద్యలో నుంచి రహదారి నిర్మాణం చేపట్టి, సిసి రోడ్డును వేశారు. గ్రామస్థుల పిర్యాదుతో దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ మోహన్ రెడ్డి, ఈఓ సత్యచంద్రారెడ్డిలు సంఘటనా స్థలికి చేరుకొని నిర్మాణ సంస్థ వేసిన రోడ్డును మొత్తం పెకిలించి, రాకపోకలు సాగకుండా కందకం తవ్వారు. కానీ ఈ దారి అందుబాటులోకి వస్తే తన ప్లాట్ల రేట్లు ఒక్కసారిగా రెండింతలవుతుందని భావించిన సదరు నిర్మాణ సంస్థ దేవుని మాన్యం భూమల ఆక్రమణను తిరిగి కొనసాగించసాగింది. అధికారులు తవ్విన కందకాన్ని ఈ మద్యకాలంలో వూడ్చివేసి మట్టిబాటతో రాకపోకలు సాగించారు. ప్రస్తుతం ఈ దారిలో మరోసారి సిసి రోడ్డు వేసి హస్తగతం చేసుకునేందుకు నిర్మాణ సంస్థ పావులు కదుపుతుంది.
రోడ్డు కోసం డబ్బుల ఎర.... గతంలో రాత్రికి రాత్రే రోడ్డు వేసి గ్రామస్థుల ఆగ్రహానికి గురైన నిర్మాణ సంస్థ ఈ దఫా మరోదారిలో తన ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామంలో ఉన్న పలువురు నాయకులకు డబ్బులు ఎరగా వేసి రహదారి నిర్మాణం చేపట్టేందుకు వథకం వేసింది. ఇదే విషయం ప్రస్తుతం గోపనపల్లి గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాణ సంస్థ గ్రామంలో ఉన్న పలువురు నాయకులకు డబ్బులు పంచిందని, రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చూస్తుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితమే సదరు నిర్మాణ సంస్థ మాన్యం భూముల మద్యలో నుంచి సిసి రోడ్డు వేయగా, నాడు దేవాదాయ అధికారులు కేవలం రోడ్డును తొలగించి, నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోకుండా వదిలివేయడంతోనే మరోసారి ఈ కబ్జాకు పథకరచన జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. దీంతో పాటు మాన్యం భూముల మద్యలో నుంచి మరో నిర్మాణ సంస్థ సైతం మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం మాన్యం భూముల్లో భారీ ఎత్తున మట్టి డంపింగ్ చేసింది. గోపన్ పల్లి మాన్యం భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం : ఎండోమెంట్ ఇన్స్ పెక్టర్ మోహన్ రెడ్డి గోపనపల్లి రంగనామడి గుడి మాన్యం భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని ఎండోమెంట్ ఇన్స్ పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలల క్రితం రాత్రికి రాత్రే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆలయ భూముల్లో నుంచి రోడ్డు వేశారని, తమకు సమాచారం అందిన వెంటనే రోడ్డు నిర్మాణాన్ని మొత్తం తొలగించడంతో పాటు బాధ్యులపై పోలీసులకు పిర్యాదు చేయాలని ఆలయ ఈఓకు సూచించినట్లు తెలిపారు. సర్వే నెంబరు 268ని పరిశీలించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని, దేవుడి మాన్యం భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Admin
Ekaburu