Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గచ్చిబౌలి అంజయ్య నగర్ లో పార్కు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూచివేతకు రంగం సిద్ధమైంది. నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఉదంతంలో ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా జిహెచ్ఎంసి సైతం నిర్మాణ అనుమతులు రద్దు చేసింది. గ్రేటర్ అధికారులు నోటీసులు జారీ చేసి భవనాలను సీజ్ చేసినా.. అక్రమార్కులు మాత్రం నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా సదరు అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టాలంటూ హైడ్రాకు శేరిలింగంపల్లి సర్కిల్ కమిషనర్ సిఫారసు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నెంబరు 134,136లలో అంజయ్య నగర్ బస్తి లేఅవుట్ చేశారు. కాలనీ పార్కు కోసం కొంత స్థలాన్ని కేటాయించగా.. సదరు స్థలంలో కొన్ని రోజుల క్రితం అక్రమ నిర్మాణాలు పుట్టుకు వచ్చాయి. ఈ విషయమై 'జనం కోసం' స్వచ్ఛంద సంస్థ శేరిలింగంపల్లి సర్కిల్, జోనల్ కార్యాలయంలో, గ్రేటర్ జిహెచ్ఎంసి కార్యాలయాల్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఆలస్యంగా కళ్ళు తెరిచిన జిహెచ్ఎంసి అధికారులు జనం కోసం ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పార్కు స్థలంలో నిర్మాణంలో ఉన్న భవనాలకు జిహెచ్ఎంసి అనుమతులు ఉన్నాయని గుర్తించి, అనుమతులు ఏ విధంగా మంజూరు చేశారనే విషయమై ఆరా తీశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మంజూరు చేసినట్లుగా సమర్పించిన పట్టా సర్టిఫికెట్ల ఆధారంగా అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు లేఖ రాయగా సదరు పట్టాలను తమ కార్యాలయం జారీ చేయలేదని వివరణ వచ్చింది.
దీంతో నిర్మాణదారులు సమర్పించిన పట్టాలు నకిలీవని తేల్చి.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిర్మాణదారులపై జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసినా నిర్మాణదారులు పెడచెవిన పెట్టి అక్రమ నిర్మాణాలను పూర్తి చేశారు. ఒక్క అంతస్తు ఉన్న సమయంలో పోలీసు కేసు నమోదు కాగా నిర్మాణదారులు ఆరంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేశారు. దీంతో జిహెచ్ఎంసి అధికారులు జులై 19, సెప్టెంబరు 2వ తేదీన భవనాలను సీజ్ చేశారు. కానీ అక్రమ నిర్మాణదారులు సీజ్ తాళాలు పగలగొట్టి సదరు భవనాలను వాడుకలోకి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. జిహెచ్ఎంసి అధికారుల హెచ్చరికలను అక్రమ నిర్మాణదారులు పెడచెవిన పెట్టడంతో సదరు భవనాల అనుమతులను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా చేపట్టిన సదరు నిర్మాణాల కూల్చివేత చేపట్టాలని హైడ్రా కు శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ 25వ తేదీన సిఫారసు చేశారు. హైడ్రా యంత్రాలను ఉపయోగించి కూల్చివేతలు చేపట్టాలని కోరారు.
Admin
Ekaburu