Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : వాళ్లంతా కోటి ఆశలతో ఎంబీబీఎస్ చదువుకోవాలని ఉక్రెయిన్ వెళ్లారు. మొదట్లో అంతా బాగానే ఉంది. సెకండ్ సెమిస్టర్ లో ఉండగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అనుకోకుండా వచ్చిపడిన యుద్ధంతో వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. జంగ్ సైరన్ లు, బాంబుల మోతల మధ్య ప్రాణాలతో స్వదేశం చేరుకోవడమే పెద్ద సవాలు అనుకున్నారు. ఎలాగోలా స్వదేశానికి తిరిగొచ్చినా మధ్యలో ఆగిపోయిన చదువు కొనసాగింపుపై బెంగ... అలాంటి సమయంలోనే నియో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారికి అండగా నిలిచింది. భారత ప్రభుత్వంతోను, ఎన్ఎంసీతోను, ఉజ్బెకిస్థాన్ విదేశీ మంత్రిత్వశాఖ, అక్కడి వైద్య కళాశాలలతో మాట్లాడి ఉక్రెయిన్ నుంచి అర్దాంతరంగా తిరిగివచ్చిన 210 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను చదువు పూర్తి చేసేందుకు ఉజ్బెకిస్థాన్ పంపించింది. ఇందులో 86 మంది అమ్మాయిలు. వీళ్లంతా ఇంతటి సంక్లిష్ట పరిస్థితిని అధిగమించి, మానసిక ఒత్తిడిని జయించి విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తిచేశారు. వాళ్లందరికీ మంగళవారం నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేశారు. వీళ్లలో 110 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, 81 మంది తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావడం విశేషం.
Also Read : ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన బిఆర్ఎస్ : ఎమ్మెల్యే గాంధీ
ఈ సందర్భంగా నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్‌రెడ్డి మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యా యుద్ధం సమయం విద్యార్థులకు నిజంగా అతిపెద్ద పరీక్షా కాలమని, ఇంత ట్రామా తర్వాత విద్యార్థులు ప్రాణాలతో స్వదేశానికి తిరిగి వస్తారా, వచ్చినా వాళ్ల చదువు పూర్తవుతుందా అనే అనుమానాలు వచ్చాయన్నారు. ఆపరేషన్ గంగతో విద్యార్థులు స్వదేశానికి వచ్చిన తరువాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)ని సంప్రదించి, వాళ్లను ఉజ్బెకిస్థాన్‌లో చదివించేందుకు అనుమతులు తీసుకుని చదివించామన్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులు చదువు పూర్తి చేశారని, 110 మంది ఎఫ్ఎంజీఈ రాయగా, 81 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు.
ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఉబ్జెకిస్థాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం ఛైర్మన్ పి. విజయబాబు, ఉజ్బెకిస్థాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్. సుయరొవ్, కౌన్సెలర్ ఐ. సొలియెవ్, నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ సందీప్ సాహూ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu