Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ""చుట్టూ రక్షణ ప్రహరీ గోడ... ఉన్న మూడు గేట్ల ద్వారానే లోపలికి వెళ్లే అవకాశం... గేట్ల వద్ద పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ... వర్సిటీ వర్గాలకు తప్పితే ఇతరులెవరికి (కనీసం రాజకీయ నాయకులు, మీడియాకు సైతం) అనుమతి లేదు.. కానీ ఇంతటి బందోబస్తు మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోరీ జరిగింది... ఏకంగా క్లాస్ రూమ్ లో ఉన్న 50 లాప్ టాప్ లను దుండగులు చంకలో పెట్టుకొని పరారయ్యారు. ""
Also Read : కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో చోటుచేసుకున్న చోరీ ఘటన సంచలనంగా మారింది.. శుక్రవారమే యూనివర్సిటీకి తెచ్చి క్లాస్ రూమ్ లో పెట్టిన లాప్ టాప్ లు ఆదివారం చోరికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గల సిఆర్ రావు ఇనిస్టిట్యూట్ విభాగం తరగతి గదిలోకి కొత్తగా శుక్రవారం 50 లాప్ టాప్ లు తెచ్చి పెట్టారు. కాగా ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి సదరు గదిలోకి ప్రవేశించారు. క్లాస్ రూమ్ లో ఉన్న 50 ల్యాప్ టాప్ లను దుండగులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. తరగతి గదిలో ల్యాప్ టాప్ లు మాయం కావడం సోమవారం ఉదయం గమనించిన వర్సిటీ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు తరగతి గది కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం, కారు టైర్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వివరాల కోసం వర్సిటీలోని సిసి కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు. కాగా సిఆర్ రావు ఇనిస్టిట్యూట్ విభాగం తరగతి గదిలో భారీ ఎత్తున ల్యాప్ టాప్ లు ఉన్నాయని తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సదరు విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, విద్యార్థుల వివదాలను మొత్తం సేకరిస్తున్నారు. కాగా మొత్తం 50 ల్యాప్ టాప్ లు చోరీకి గురికావడంతో చోరీలో పాల్గొన్న వారు ఒక్కరు అయ్యే అవకాశం లేదని, ఎక్కువ మంది కలిసి ఈ చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా చోరికి గురైన లాప్ టాప్ లు శుక్రవారం రోజే వర్సిటీకి తీసుకురాగా, వీటి విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు. నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu