Ekaburu - క్రైమ్ / : నిరుద్యోగులను నమ్మించడం కోసం ఏకంగా నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు ఓ కేటుగాడు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు దిగి, పోలీస్ అధికారిగా చలామణీ అవుతూ నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. ఈ నకిలీ పోలీసు అధికారికి అతని ప్రియురాలు సైతం జతకలిసి ఉద్యోగుల కోసం చూస్తున్న అమాయకులను బురిడీ కొట్టించారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగులమని నిరుద్యోగుల్ని నమ్మించిన ఈ ప్రేమజంట పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 30మంది నుంచి రూ.3కోట్ల రుపాయలు వసూలు చేశారు. వీరి మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
Also Read : టాటా టెక్నాలజీస్ తో తెలంగాణ ప్రభుత్వ ఏంఓయూ
నిందితుడు హనుమంతు రమేష్ గతంలో సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన హనుమంతు రమేష్ గతంలో గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. రమేష్ కొన్నిరోజుల పాటు తన ప్రియురాలితో కలిసి విశాఖపట్నం అడవివరం ఆర్ ఆర్ టవర్స్ లో నివాసం ఉన్నాడు. ఈ సమయంలో తన ప్రియురాలితో కలిసి పోలీసు అధికారినంటూ కొత్త డ్రామాకు తెరతీశాడు. ప్రియురాలితో కలిసి పోలీసు యూనిఫాంలో నిరుద్యోగులను కలిసి, తాను పోలీసు అధికారినంటూ నమ్మించేవాడు. వీరికి మధ్యవర్తులు సైతం సహాయం చేశారు. 3కోట్ల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్ లో తలదాచుకున్న ఈ ప్రేమజంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు రమేష్ గతంలో ఇద్దరు అక్కా, చెల్లెళ్లను పెళ్లి చేసుకోగా, ప్రస్తుతం తన ప్రియురాలితో నివాసం ఉంటూ నేరాలకు పాల్పడినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.
Admin
Ekaburu