Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల మీద కాల్పులు జరిపి సంచలనం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ని గచ్చిబౌలి పోలీసులు విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. ప్రీజం పబ్ వద్ద జరిగిన కాల్పుల అనంతరం బత్తుల ప్రభాకర్ ను మాదాపూర్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రీజం పబ్ వద్ద ప్రభాకర్ జరిపిన కాల్పుల్లో సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి గాయపడగా, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని బత్తుల ప్రభాకర్ ను రిమాండ్ కు తరలించారు. కాగా బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడం, ప్రభాకర్ చేసిన నేరాల చిట్టా మీద మరింత సమాచారం కోసం విచారించేందుకు గచ్చిబౌలి పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. పోలీసు కస్టడీ పిటీషన్ మీద స్పందించిన కోర్టు బత్తుల ప్రభాకర్ ను మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు బుధవారం ప్రభాకర్ ను సంగారెడ్డి జైలు నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.
Also Read : వెసెల్లా వుడ్స్ విల్లాస్లో చోరికి ప్రయత్నించిన దొంగల ముఠా
మూడు రోజుల విచారణలో భాగంగా మొదటి రోజు బత్తుల ప్రభాకర్ ను గచ్చిబౌలి పోలీసులు గత రెండు, మూడేళ్ల కాలంలో చేసిన నేరాల మీద ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ప్రీజం పబ్ వద్ద ఆరెస్టుకు ముందు పోలీసుల మీద జరిపిన కాల్పుల్లో ఉపయోగించిన ఫిస్తోళ్ల కొనుగోలు, అందుకు సహకరించిన వారి వివరాల సేకరణపై ఎక్కువగా పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. కాగా పోలీసు విచారణలో బత్తుల ప్రభాకర్ తాను చేసిన నేరాల చిట్టాను పూసగుచ్చినట్లు వెల్లడిస్తూ పోలీసులకు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. విచారణలో భాగంగా తాను ఒక్కడినే చోరీలు ఎందుకు చేస్తానో ప్రభాకర్ వెల్లడించాడని, ఎవ్వరినైనా కలువుకొని చోరీలు చేస్తే పోలీసులకు పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుందని... అందుకోసమే తాను ఒక్కడినే చోరీలు, దోపిడీలకు పాల్పడుతానని ప్రభాకర్ చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు చోరీ చేసిన సొమ్ముతో ఫారీన్ మద్యం సేవించడం, జల్సాలు చేయడం, పబ్బులకు తిరగడం, ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం చేసే వాడని, పోలీసులకు పట్టుబడకుండా తాను నివాసం ఉండే ఇళ్లు, తిరిగే కార్లు మొత్తం స్నేహితుల పేరు మీదే అద్దెకు తీసుకోవడం, కొనుగోలు చేయడం చేసేవాడని సమాచారం. తన నేరాల గురించి స్నేహితులకు సైతం తెలియకుండా ప్రభాకర్ జాగ్రత్త పడేవాడని, ఎవ్వరైనా స్నేహితుడికి విషయం తెలిస్తే భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పి నోరు మూయించడంతో పాటు అక్కడి నుంచి బిచాణా ఎత్తివేసే వాడని విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారం. గత మూడేళ్లుగా బత్తుల ప్రభాకర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో చేసిన చోరీలపై పోలీసులు మొదటి రోజు ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తుంది.
Admin
Ekaburu