Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సువిశాలంగా, అందంగా తీర్చిదిద్దిన ఐటీ కారిడార్ రహదారులు బైక్ రేసింగ్ లకు అడ్డాలుగా మారుతున్నాయి అర్థరాత్రి వేళల్లో ట్రాఫిక్ రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉండే ఐటీ కారిడార్ రహదారుల మీద బైక్ రేసర్లు ప్రమాదకర స్టంట్లతో తోటి వాహనదారులను బంబేలెత్తిస్తున్నారు. రేసర్ల బైక్ రేసింగ్ లు, ప్రమాదకర స్టంట్ల కారణంగా ఐటీ కారిడార్ పరిధిలో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని రహదారుల మీద బైక్ రేసింగ్ ల కారణంగా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో పోలీసులు రేసర్ల ఆగడాలను నియంత్రించే చర్యలు చేపట్టారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మాదాపూర్ డిసిపి వినీత్ ఆధ్వర్యంలో ఐటీ కారిడార్ పరిధిలో బైక్ రేసింగ్ లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Also Read : చుట్టూ గోడ అక్రమం... మధ్యలో గది సక్రమమా...?
ఈ మేరకు రాయదుర్గం పోలీసుల ఆధ్వర్యంలో ఐటీ కారిడార్ పరిధిలో బైక్ రేసింగ్ లకు అడ్డాలుగా మారిన రహదారులను గుర్తించారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఈ బైక్ రేసింగ్ లు చోటు చేసుకుంటుండడంతో రాయదుర్గం పోలీసులు శనివారం రాత్రి బైక్ రేసింగ్ స్పాట్లపై దాడులు నిర్వహించారు. ఐటీ కారిడార్ పరిధిలోని టీ హబ్, కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వా బిల్డింగ్, మై హోమ్ భుజ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి బైక్ రేసింగ్ ల కోసం సిద్ధంగా ఉంచిన రేసింగ్ లకు పాల్పడుతున్న మొత్తం 50 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలు అధునాతన బైకులు, స్పోర్ట్స్ వాహనాలు ఉండడం విశేషం. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం రవాణా శాఖకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ రేసర్లను అరెస్టు చేసి వారి మీద ఐపీసీ సెక్షన్ 336, 341, మోటార్ వెహికల్ ఆక్ట్ 154 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదాపూర్ ఎసిపి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాయదుర్గం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
Admin
Ekaburu