Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలి అంజయ్య నగర్ రణరంగంగా మారింది. రెండు వర్గాలు రహదారిపై బాహాబాహికి దిగి దాడులకు పాల్పడడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాన రహదారిపై రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అంజయ్య నగర్ లో ఓ ఇంటిని కాళీ చేయించేందుకు ఓ వ్యక్తి తన అనుచరులతో దాడి చేయడంతో వివాదం ఏర్పడింది. సదరు ఇంటి కరెంటు మీటరును తొలగించి ఇంట్లో ఉన్న వారిపై దాడులకు తెగబడ్డారు. విషయం గమనించిన స్థానికులు ఇంటి యజమానికి అండగా వచ్చి కబ్జాకు వచ్చిన వారిపై ప్రతి దాడి చేశారు. దీంతో కబ్జాకు వచ్చినవారు అక్కడి నుండి పారిపోగా స్థానికులకు దొరికిన కొందరిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
Also Read : అధికారుల అండదండలా.. అక్రమార్కుల బరితెగింపా
అంజయ్య నగర్ సగర సంఘం కార్యాలయం పక్కనే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదకు వచ్చిన ఇరువర్గాలు ఉరుకులు, పరుగులతో దాడులకు తెగబడడంతో ఈ దారిలో వెళ్తున్న వాహనదారులు బంబేలెత్తారు. ఈ దాడుల విషయమై రామకృష్ణ అనే ఇంటి యజమాని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu