Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని... అప్పులు పుట్టడం లేదంటూ.. ఓవైపు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ప్రకటనలు గుప్పిస్తుండగా, మరోవైపు దుబారాను మాత్రం జోరుగా చేస్తున్నారు. ఉద్యోగుల జీతాల పెంపు, సంక్షేమ పథకాల అమలుపై రూపాయికి రూపాయి లెక్కలు వేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ఒక్క పూట భోజనాల ఖర్చుకు మాత్రం లక్షలు వెచ్చిస్తున్నారు. తెలంగాణ ప్రజా భవన్ లో ప్రజా ప్రతినిధుల భేటీలో ఒక్క పూట భోజనాల ఖర్చుకు అక్షరాల 13.59 లక్షల రూపాయలు ఖర్చు చేయడం... అందులో పాల్గొన్నది డిప్యూటీ సీఎం, 10 మంది ఎంపీలు కావడం విశేషం. ప్రస్తుతం ఈ బిల్లుల రిలీజ్ లేఖ బయటకు వచ్చి రాష్ట్రంలో వైరల్ గా మారింది.
Also Read : డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు
గత పార్లమెంటు సమావేశాలకు ముందు మార్చ్ 8వ తేదీన తెలంగాణ ఎంపీలతో ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు బిజెపి ఎంపీలు, ఒకరిద్దరు అధికారులు హాజరయ్యారు. కాగా ఈ మీటింగ్ ఒక పూట భోజనాలు, ఇతర ఖర్చుల కింద 13.59 లక్షల బిల్లులు పెట్టారు. ఈ బిల్లులకు ప్రభుత్వం డిసెంబర్ 22వ తేదీన ఆమోదం తెలిపి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్‌కు రూ. 8,43,700.. హోటల్ ది ప్లాజాకు రూ.1,95,800... ఎన్ఎం కంపెనీకి రూ. 3.06,517.. అంజలి ఫ్లోరిస్ట్‌కు రూ.6వేలు... సంతోష్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.7,200 చొప్పున ఖర్చుల నిధులను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ బిల్లు ప్రతి బయటకు వచ్చి వైరల్ గా మారింది ఒక డిప్యూటీ సీఎం, పదిమంది ఎంపీలు, ఒకరిద్దరు అధికారులు పాల్గొన్న సమావేశంలో ఒక్క పూట భోజనానికి రూ.13.59 లక్షలు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Admin
Ekaburu