Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : మాజీ మంత్రి, సీనియర్ నాయకులు హరీష్ రావు శేరిలింగంపల్లి పర్యటనలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. హరీష్ రావు కార్యక్రమంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోవడం.. ఇతర నియోజకవర్గాల నాయకుల హడావిడితో పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని, పార్టీ పటిష్టత ధ్యేయంగా పనిచేస్తున్న స్థానిక నాయకులను కాదని ఇతర నాయకులకు అగ్ర తాంబూలం వెయ్యడం విమర్శలకు వేదిక అయింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్, తెలంగాణ ఉద్యమకారుడు కొమిరిశెట్టి సాయిబాబా కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోవడం.. పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం సంచలనంగా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రోగ్రాంకు పలువురు సీనియర్ నాయకులు డుమ్మాకోట్టగా, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రోగ్రాం మధ్యలోనే అలిగి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా కార్యక్రమం వద్దకు వచ్చిన సాయిబాబాను నిర్లక్ష్యం చేయడంతో అనుచరులు, పార్టీ నాయకులు పిస్తుపోయారు. తమకు ప్రాధాన్యత లేనిచోట ఉండడం ఎందుకని అనుచరులు సాయిబాబా మీద ఒత్తిడి తీసుకురావడంతో ప్రోగ్రాం మధ్యలోనే సాయిబాబా వెనుదిరిగి వెళ్ళిపోయారు. అనంతరం సాయిబాబాకు హరీష్ రావు ఫోన్ చేసినా స్పందించలేదని తెలుస్తుంది.
సాయిబాబా దారెటు.. ? మాజీమంత్రి హరీష్ రావు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుల మధ్య వెలుగుచూసిన లుకలుకలు సంచలనంగా మారగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా దారేటు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సాయిబాబా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా పనిచేశారు. కొండకల్ శంకర్ గౌడ్ మరణానంతరం పార్టీని అన్నితానై నడిపించగా.. అనంతర కాలంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం టిడిపి నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో మధ్యలో బిఆర్ఎస్ అత్యంత పటిష్టంగా కనిపించింది. కాగా మారిన రాజకీయ పరిస్థితులతో ఎమ్మెల్యే గాంధీ పలువురు కార్పొరేటర్లు పార్టీకి దూరం కాగా, సీనియర్ నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ సాయిబాబా మాత్రం బీఆర్ఎస్ పార్టీని వదలకుండా పార్టీ పటిష్టతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శేరిలింగంపల్లి ఆత్మీయ సమ్మేళనాన్ని సైతం ముందుండి నడిపించారు. తాజాగా సాయిబాబా అలిగి వెళ్లిపోవడంతో పాటు గచ్చిబౌలి కార్యాలయంలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సాయిబాబా అలక బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకుల జోక్యంతో టీ కప్పులో తుఫానులా తేలిపోతుందా లేక తన అనుచరులతో ఇతర పార్టీలోకి వెళతారా అనే ప్రశ్న నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
Admin
Ekaburu