Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న జోనల్ కమిషనర్లు విధిగా కాలనీలు, బస్తీల్లో పర్యటించాలని, కాలనీల్లో పర్యటించని జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చన్న ముఖ్యమంత్రి హెచ్చరించారు. సదరు అధికారులకు కావాలంటే కుర్చీల్లో కూర్చొనే పోస్టులు ఇస్తామని అన్నారు. శుక్రవారం హెచ్ఎండీఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ పరిధిలో భవన అనుమతుల్లో అక్రమాలు తమ దృష్టికి వచ్చిందని, చాలా భవనాలకు ఆన్ లైన్ లేకుండా అనుమతులు మంజూరు చేశారని, సదరు అనుమతుల ఫైల్స్ సైతం కనిపించడం లేదన్నారు. ఆన్ లైన్ లేకుండా ఇచ్చిన భవనాల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. మరో 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోవడం ఖాయమని హెచ్చరించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని 3500 చెరువుల డేటా ఆన్‌లైన్ లో ఉండాల్సిందేనని, వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని ప్రశ్నించారు. తక్షణమే చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో కమిషనర్లు లేకపోవడంపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొత్త మున్సిపాలిటీలకు గ్రూప్ 1 అధికారులు, కార్పొరేషన్లకు ఐఏఎస్ లు కమిషనర్లుగా ఉండేలా చూడాలన్నారు. మున్సిపాలిటీల్లో పని చేసే మున్సిపల్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలని, జీహెచ్ఎంసీలో వయస్సుపైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. నగరంలో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని, మల్టీ యుటిలిటీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరానికి మంచి నీటి కొరత లేకుండా చూడాలని, స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాలన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా అయ్యేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు దాన కిషోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu