Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ కు ట్రాఫిక్ కష్టాల గ్రహణం వీడడం లేదు. ముఖ్యంగా వర్షం పడిన రోజు కొత్త కష్టాలు ఏర్పడుతున్నాయి. చినుకు పడిందంటే పెద్ద ఎత్తున రహదారుల పైకి చేరుతున్న ఫోర్ వీలర్ వాహనాలతో ట్రాఫిక్ తిప్పలు పెరుగుతున్నాయి. ఐటీ కారిడార్ లోని కొన్ని రహదారులు నిత్యం ట్రాఫిక్ చక్రబంధంతో వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తుండగా చినుకు పడిందంటే వాహనదారుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నగరాన్ని ప్రపంచ పటంలో నిలుపుతున్న గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రహదారులను ఎంతగా విస్తరించినా.. ఫ్లై ఓవర్లు నిర్మించినా.. అండర్ పాస్ లు తెరిచినా... ట్రాఫిక్ సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు.
Also Read : ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ..
చిన్న వర్షం పడిందంటే వాహనదారులు గంటలకు గంటలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వర్షం పడిందంటే ఐటీ ఉద్యోగులు చాలావరకు తమ కార్లతో రోడ్లపైకి వస్తుండడంతో వర్షాలు పడిన రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయి. సాధారణ రోజుల్లో ప్రజా రవాణా, టూవీలర్ వాహనాలను ఉపయోగించే వారు సైతం వర్షం పడిన రోజు తమ కార్లను బయటకు తీస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్ రహదారులపై రద్దీ పెరిగి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పెద్ద ఎత్తున రహదారుల పైకి వస్తున్న ఫోర్ వీలర్ వాహనాలతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుండగా, ట్రాఫిక్ పోలీసులు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.
బుధవారం రోజంతా కురిసిన సాధారణ మూసురు ఐటీ కారిడార్ రహదారులను ట్రాఫిక్ వలయంలో ముంచింది. కొండాపూర్ ఫ్లైఓవర్ మొత్తం మధ్యాహ్నం 1గంట సమయంలో సైతం వాహనాలతో నిండిపోగా, ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు వాహనాల బారులతో కిక్కిరిసిపోవడం ట్రాఫిక్ సమస్యను కళ్లకు కట్టింది. దీంతోపాటు రాయదుర్గం, మాదాపూర్, లింగంపల్లి, హెచ్సీయూ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు గంటల కొద్ది ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రహదారులు గుంతలమయం కావడం, కొన్ని రహదారులు విస్తరణకు నోచుకోకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు పడిన రోజుల్లో ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న కార్యాలయాలు తమ టైమింగ్ మార్చుకోవాలని, అన్ని కార్యాలయాలు ఒకే టైం లో ఉద్యోగులను వదలకుండా సమయాన్ని మార్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ఒకేసారి వాహనాలు రహదారుల పైకి రాకుండా నిరోధించవచ్చని అంటున్నారు. దీంతోపాటు కార్ పూలింగ్ పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఉద్యోగులను అలవాటు చేయాలంటున్నారు.
Admin
Ekaburu