Ekaburu - స్పెషల్ స్టోరీస్ / సంగారెడ్డి : పైసా పైసా కూడబెట్టి తాము కొనుక్కున్న ప్లాట్లను కొంతమంది అడ్డదారిలో కాజేయాలని చూస్తున్నారని కొల్లూర్ లక్ష్మీపురం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలతో పేదల స్థలాలను ధరణిలో ఎక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రామచంద్రారం తహసీల్దార్ కార్యాలయానికి వందలాది మంది ప్లాట్ ఓనర్లు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులలో బయల్దేరి వందల మంది ప్లాట్ల యజమానులు తహసీల్దార్ కార్యలయానికి చేరుకొని తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సత్తయ్య, మల్లేష్, నర్పింహా మూర్తి తదితరులు మాట్లాడుతూ కొల్లూర్‌లోని సర్వే నంబర్లు 174, 175, 177, 180 నుండి 183, 186 నుండి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్లో దాదాపు 1500 మంది పేదలు ప్లాట్లు కొనుగోలు చేశారని అన్నారు. 1984 లో అసలు పట్టాదారులు, జీపీఏ హోల్లర్లు అయిన మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, రఘునందన్ రెడ్డిల నుండి నిరుపేదలు ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు.
Also Read : స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరుల చైతన్యాన్ని ప్రదర్శిస్తాం : సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
నాటి నుండి తామే పొజిషన్లో ఉన్నామని, కానీ ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలను సృష్టించి తమ ప్లాట్లను ఆక్రమించాలని కుట్రలు చేస్తున్నారని వాపోయారు. తాజాగా తమ ప్లాట్ల స్థలాలను ధరణి పోర్టల్‌లో చేర్చుకొని వాటికి పట్టా పాస్ బుక్కులు పొందాలని దరఖాస్తులు చేసుకున్నారని, అక్రమ పద్దతితో ప్లాట్లను ఆక్రమించుకోవాలనుకునే వారికి అధికారులు సపోర్ట్ చేయొద్దని తహసీల్దార్‌కు మొరపెట్టుకున్నారు. ఈ విషయంలో ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు గతంలో లోకాయుక్తాకు నివేధిక ఇచ్చారని, దానికి అనుగుణంగా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ ప్లాట్లకు సంబంధించి ఎలాంటి మ్యుటేషన్లు, పాస్ బుక్కులు జారీ చేయొద్దని కలెక్టర్‌ను సైతం కలిసినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్లాట్ ఓనర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
Admin
Ekaburu