Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : శేరిలింగంపల్లి రెవెన్యూ కార్యాలయంలో నకిలీ పట్టాల బాగోతానికి ఇదో మచ్చు తునక... రెవెన్యూ కార్యాలయంలో ఆర్టీఐ యాక్ట్ కోసం కేటాయించిన సీరియల్ నంబరుతో జీఓ 58 పట్టాను సృష్టించిన కేటుగాళ్లు అదే ఆర్టీఐ దరఖాస్తుతో అడ్డంగా దొరికిపోయారు. నకిలీ పట్టా సృష్టించడమే కాదు, పట్టా ఆధారంగా పేదోడి ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు నకిలీ పట్టాతో కోర్టులో కేసు వేసి న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించారు. హైటెక్ మండలం శేరిలింగంపల్లిలో నకిలీ పట్టాల బాగోతం పెను సంచలనంగా మారుతుంది. నకిలీ పట్టాల ఉదంతాలు వరుసగా వెలుగు చూస్తుండడం స్థానికులను విస్మయానికి గురిచేస్తుండగా, నకిలీ పట్టాల చలామణిలో గత రెవెన్యూ అధికారులే కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి." తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 58 రెగ్యులరైజేషన్ పట్టాలు శేరిలింగంపల్లిలో అక్రమార్కులకు వరంగా మారాయి. జీఓ 58 నకిలీ పట్టాలతో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కాజేసి భారీ భవంతులు నిర్మిస్తుండగా, మరికొందరు పేదల భూములను ఆక్రమిస్తున్నారు. గత మూడు నెలల క్రితమే అంజయ్యనగర్ లో నకిలీ పట్టాలతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు పొంది, పార్కు కబ్జాకు యత్నించడం, స్థానిక రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల పిర్యాదుతో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్యనగర్ లోనే మరో నకిలీ పట్టా వెలుగు చూడడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. నకిలీ పట్టాతో ఓ వ్యక్తి పేదల ఇంటి మీద దాడి చేసి కబ్జాకు యత్నించడంతో పాటు కోర్టును సైతం నకిలీ పట్టాతో తప్పుదోవ పట్టించాడు. బాధితుడు సహచట్టంతో నకిలీ పట్టా బాగోతాన్ని వెలికి తీశాడు.
నకిలీ పట్టాతో కబ్జాకు యత్నం... శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నెంబరు 135,136లలో ఉన్న అంజయ్యనగర్ లో ఓ వ్యక్తి గత 20ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న ఇంటికి జీహెచ్ఎంసీ నుంచి ఇంటినెంబరు 209/136/1/ఏ ను తీసుకొని ట్యాక్స్ కడుతున్నాడు. సదరు ఇంటికి విద్యుత్ కనెక్షన్, మంజీరా కనెక్షన్ తీసుకున్నాడు. కాగా కొన్ని నెలల క్రితం వీరి ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తి సదరు స్థలం తనదంటూ ఆక్రమించేందుకు యత్నించాడు. సదరు స్థలం తనకు జీఓ 58 కింద రెగ్యులరైజేషన్ ఫైల్ నెంబరు బి/30/2015లోని పట్టానెంబరు బిపిఎల్ఆర్ఆర్ డి 2150604150791తో షేక్ చాంద్ పాషా పేరు మీద జారీ అయిన పట్టాను చూపించాడు. 2015లో తనకు పట్టా జారీ అయ్యిందంటూ అదే పట్టాతో కోర్టులో కేసు సైతం వేశాడు. ఎన్నో ఎళ్లుగా నివాసం ఉంటున్న తన ఇంటిపై మరొకరికి పట్టాలను మంజూరు చేయడంపై బాధితుడు విస్తుపోయాడు. సదరు పట్టా జారీపై వివరాలు వెల్లడించాలని స.హ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. కబ్జాదారుడు చూపిస్తున్న సదరు పట్టా తమ కార్యాలయం జారీ చేయలేదని, అసలు పట్టాలో పేర్కొన్న ఫైల్ నెంబరులో సీరియల్ నెంబర్ 30ని సీ సెక్షన్ ఆర్టీఐ యాక్ట్ దరఖాస్తుల కోసం కేటాయించినట్లు తేల్చి చెప్పారు. దీంతో ఆర్టీఐ దరఖాస్తుల కోసం కేటాయించిన సీరియల్ నెంబరుతో నకిలీ జీఓ 58 పట్టాను సృషించిన కబ్జాదారులు అడ్డంగా దొరికిపోయారు.
నకి'లీలల'పై పట్టనట్టుగా రెవెన్యూ అధికారులు... కాగా శేరిలింగంపల్లిలో నకిలీ పట్టాల బాగోతాలు రోజుకొకటి బయటపడుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. నకిలీ పట్టా సర్టిఫికేట్లు మండల పరిధిలో యదేచ్చగా చెలామణి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత రెవెన్యూ అధికారుల తప్పిదాల కారణంగానే మంజూరు చేయని పట్టా కాపీలు అక్రమార్కుల చేతుల్లో పడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల క్రితం సైతం నకిలీ పట్టాలు సృష్టించి అంజయ్యనగర్ లో పార్కు స్థలం కబ్జా చేసిన విషయం బయటపడింది. నకిలీ పట్టాలతో సదరు స్థలాన్ని ఆక్రమించడంతో పాటు పట్టాల ఆధారంగా జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకొని భారీ బహుళ అంతస్థుల నిర్మాణం చేపట్టడంపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయగా, పోలీసు కేసు నమోదైంది. నాటి ఘటనలో పిర్యాదు చేసి అధికారులు చేతులు దులుపుకోవడంతో నేటికీ అక్రమ నిర్మాణం యదేచ్చగా సాగుతుంది. తాజాగా బయటపడిన నకిలీ పట్టా మీద సైతం రెవెన్యూ అధికారులు బాధితుడికి వివరణ ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది.
Admin
Ekaburu