Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కేటాయించిన రిజర్వేషన్ల ప్రక్రియతో పలు గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క ఓటరు లేని సామాజిక వర్గాలకు సైతం గ్రామపంచాయతీలో సర్పంచ్ వార్డు, మెంబర్ స్థానాలను రిజర్వ్ చేయడంతో పలు గ్రామాలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాయి. లేని ఓటర్లను ఎక్కడి నుంచి తెచ్చి పోటీలో నిలబెట్టాలని గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు. అసలు సామాజిక వర్గం ఓటర్లే లేని చోట రిజర్వేషన్లు కేటాయించడం ఒక ఎత్తైతే.. ఒకరు, ఇద్దరు ఉన్నచోట వారే ఏకగ్రీవం అవుతున్నారు. పదుల సంఖ్యలో ఉన్న సామాజిక వర్గానికి సైతం రిజర్వేషన్ కేటాయించడం వంటి సంఘటనలు పంచాయతీ ఎన్నికలలో చోటు చేసుకోవడం విచిత్రంగా మారింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు సైతం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న రిజర్వేషన్ల విచిత్రాలు మచ్చుకు కొన్ని... 1)నల్గొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గ ప్రజలు ఒక్కరు కూడా లేరు. కానీ ఈ గ్రామంలో సర్పంచ్ స్థానంతో పాటు 4 వార్డు మెంబర్ స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
Also Read : కొండాపూర్ లో 'బగ్గా' పై భగ్గుమన్న కాలనీవాసులు
2) వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామంలో ఎస్టీ ఓటరు ఒక్కరూ లేరు. కానీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డు మెంబరు స్థానాలను ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. 3) వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో కేవలం 6గురు ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్, 2 వార్డు మెంబర్ స్థానాలను వారికి రిజర్వ్ చేశారు.
4) నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో కేవలం 8 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానాన్ని సదరు సామాజిక వర్గానికి రిజర్వేషన్ చేశారు. 5) వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశలపల్లి గ్రామంలో 1500 ఓటర్లు ఉండగా ఎస్ సీ సామాజిక వర్గ మహిళ ఒక్కరే ఉన్నారు. ఈ గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళ కు కేటాయించారు. దీనితో సదరు మహిళ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, రాజకీయ పార్టీలు తమ పార్టీలో చేరాలంటూ మహిళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి.
Admin
Ekaburu