Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించేలా పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో తెలంగాణ కీలక స్థానంలో ఉండాలనే లక్ష్యంతో పర్యాటక రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్రమోషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యo కల్పించి ప్రోత్సహించేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓ వైపు జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, టూరిజం ప్రమోషన్ లో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేస్తున్న మంత్రి జూపల్లి మరోవైపు ఐటీ ఉద్యోగులు, యువత, వివిధ సంఘాలతో తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగులతో మంత్రి జూపల్లి కృష్ణరావు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్ ను లాంచ్ చేశారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా మైండ్ స్పేస్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు తెలంగాణ హరిత హోటల్స్ లో 15 శాతం డిస్కౌంట్ అవకాశం కల్పిస్తున్నామని, దీన్ని మరిన్ని ఐటీ కంపనీ ఉద్యోగులకు విస్తరిస్తామని మంత్రి ప్రకటించారు. స్కాన్ కోడ్ లో రిజిస్టరైన ఐటీ ఉద్యోగులు ఈ డిస్కౌంట్ కూపన్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు.
Also Read : గచ్చిబౌలి డివిజన్ లో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించి, పర్యాటకులను ఆకర్శించేందుకు తానే స్వయంగా సేల్స్ మెన్ అవతారం ఎత్తానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమని, చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, జలవనరులు, సెలయేర్లు, దేవాలయాలు, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్ సాంస్కృతి, మెడికల్ టూరిజం లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఇన్ని వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ పర్యాటకాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నామని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించేందుకు ఆధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యాంత్రిక జీవన విధానం నుంచి బయటపడేందుకు వారానికి లేదా నెలకు ఒక్కసారైనా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు. పర్యాటకంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ కళారూపాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న విమనాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ఇతర తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, త్వరలోనే పర్యాటక శాఖ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, పర్యాటక శాఖ సంచాలకులు ఇలా త్రిపాఠి, రహేజా గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనే శ్రవణ్ కుమార్ తో పాటు బిపిన్ చంద్ర, అమరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu