Ekaburu - తెలంగాణ / భద్రాద్రి : భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం 22,500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నమూనాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుందన్నారు. కాబట్టే ఇండ్లను ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ పథకంలో భాగంగా 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read : మీదికుంట చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన
ఏ పథకం ప్రారంభించినా ఈ ప్రజా ప్రభుత్వం కచ్చితంగా పూర్తి చేసి తీరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భద్రాద్రి రాముల వారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని, ముఖ్యంగా గోదావరి నది రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల మేరకు లబ్ధి చేకూర్చడం, రూ. 500లకే వంటగ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి నిరుపేదల సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
Admin
Ekaburu