Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : ఓ వైపు జోరు వాన... కూర్చునేందుకు కుర్చీలు దేవుడెరుగు... వానకు తడవకుండా తలదాచుకునే చోటులేకుండా పోయింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రారంభోత్సవ కార్యక్రమం ఒంటిగంట దాటినా ప్రారంభం కాలేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజల కష్టాలు అన్నీఇన్ని కావు. ఓ వైపు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గ్రూపు తగాదాలతో ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోటాపోటీగా జనసమీకరణ చేశారు. ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన రెండు టెంట్లు ఏ మూలకు సరిపోలేదు. జనాన్ని తీసుకువచ్చిన నాయకులకే టెంట్లు సరిపోకపోవడం, సభ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యంతో సభకు వచ్చిన జనం వర్షంలో తడిచి ముద్దయ్యారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంబొత్సవం ఉండగా ఉదయం 11 గంటల నుంచే నాయకులు సభా స్థలి వద్దకు జనాన్ని సమీకరించి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉండగా, ముఖ్యమంత్రి అదే సమయంలో హైటెక్స్ లో నిర్వహించిన కమ్మ సమావేశానికి హాజరు కావడంతో మధ్యాహ్నం 1.30 ఐనా ప్రారంభం కాలేదు. దింతో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలు 2 గంటలుగా వర్షంలో తడుస్తూ నిలబడి ఆపసోపాలు పడ్డారు. ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నాయకుల అత్యుత్సహంతో ప్రజలు భారీగా రావడంతో పోలీసులు సైతం భద్రతా ఏర్పాట్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలతో పాటు వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చేసిన అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఉదయం నుంచే వర్షం ఉండగా, అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహించారు.
Admin
Ekaburu