Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : నగరంలోని చెరువుల్లో ఎఫ్టిఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మీద కొరడా జలిపిస్తున్న హైడ్రా నిర్మాణదారుల మీద సైతం చర్యలు చేపట్టింది. చెరువుల ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మదీన గూడ ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టారని స్వర్ణలత, కృష్ణ కిషోర్ల పై ఇరిగేషన్ శాఖ అధికారులు మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు నిర్మాణదారుల మీద కేసు నమోదు చేశారు. నిజాంపేట్ ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని మ్యాప్స్ ఇన్ఫ్రా ఎండి సుధాకర్ రెడ్డి పై ఇరిగేషన్ శాఖ అధికారులు పిర్యాదు చేయగా, బాచుపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నిర్మాణాలను హైడ్రా ఇప్పటికే కూల్చివేసిన విషయం తెలిసిందే.
Also Read : నగరంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
అధికారుల పైనా క్రిమినల్ కేసులు... చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపైనా హైడ్రా చర్యలు తీసుకుంది. ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు సైబరాబాద్ ఈఓడబ్లు వింగ్‌లో కేసులు నమోదు చేసిన సీపీ అవినాష్ మహంతి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై, చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్‌పై, మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్‌లపై, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
Ekaburu