Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : రెసిడెన్షియల్ కాలనీలో నివాస గృహాల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు బగ్గుమన్నారు. వైన్ షాపు ఏర్పాటు కోసం అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే తొలగించాలంటూ జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కాలనీలో వైన్ షాపు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని, స్థానికులకు ఇబ్బందికరంగా మారుతుందని వాపోయారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో ఓ వైన్ షాపు కోసం కొత్తగా ఖాళీ స్థలంలో అక్రమ షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ షెడ్డులో బగ్గా వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళనకు దిగారు.
Also Read : అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం
కాలనీవాసుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్మాణదారులు సదరు అక్రమ నిర్మాణాన్ని జోరుగా కొనసాగిస్తుండడంతో రాజరాజేశ్వరి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రెసిడెన్షియల్ కాలనీలో, నివాస గృహాల మధ్య వైన్ షాపు కోసం అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు ను వెంటనే అడ్డుకోవాలని కోరారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా సర్కిల్ పరిధిలోని కొందరు అధికారుల అండదండలతో కొనసాగుతున్న ఈ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి వైన్ షాపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
Ekaburu