Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సంధ్య కన్ స్ట్రక్షన్స్ ఏండీ శ్రీధర్ రావు ఆక్రమ సామ్రాజ్యంపై హైడ్రా అధికారులు మరోసారి యాక్షన్ కు దిగారు. ఎఫ్ సిఐ లేఅవుట్లో రహదారులు, పార్కులను ఆక్రమించి సంధ్య కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టిన నిర్మాణాలను మొత్తం నేలమట్టం చేశారు. గత మే 7వ తేదీన ఓ సారి సంధ్య అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టగా, మరోసారి సంధ్య శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలను కొనసాగించాడు. దీంతో ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం మరోసారి కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్ సిఐ లేఅవుట్లో కొనసాగతున్న ఓ నాలుగంతస్థుల భవనం, ఫుడ్ కోర్టు, నిర్మాణంలో ఉన్న భవనాల స్లాబులు,, సెల్లార్ స్లాట్లు, ఫుడ్ స్టాళ్లను, పెట్రోలు బంకును పాక్షికంగా కూల్చివేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
Also Read : మీడియా'తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘనా..?
శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నెంబరు 124,125లలో 1981వ సంవత్సరంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్ ను చేశారు. ఇందులో మొత్తం 162 ప్లాట్లు చేసి ఎఫ్సిఐలో పనిచేస్తున్న ఉద్యోగులకు రేటాయించారు. అనంతర కాలంలో పలువురు ఉద్యోగులు ఇతరులకు ఈ ప్లాట్లను విక్రయించారు. కాగా ఈ లేఅవుట్ ను ఆనుకొని సంధ్య కన్వెన్షన్ ఉండగా, సంధ్య కన్వెన్షన్ ఎండి సరనాల శ్రీధర్ రావు చూపు లేఅవుట్ మీద పడింది. త్రిపుల్ ఐటి చౌరస్తా పక్కన ఉన్న ఈ లేఅవుట్ హాట్ కేక్ కావడంతో శ్రీధర్ రావు లేఅవుట్ మొత్తం హస్తగతం చేసుకునే ప్రణాళికకు తెరలేపాడు. ఇందులో భాగంగా కొన్ని ప్లాట్లను కొనుగోలు చేయడంతో పాటు లేఅవుట్లో ఉన్న హద్దులను మొత్తం చెరిపేశాడు. శ్రీధర్ రావు పెడుతున్న బాదలు భరించలేక కొంతమంది ఉద్యోగులు అతనికే చెప్పిన ధరకు తమ ప్లాట్లను విక్రయించారు. ఈ విధంగా మొత్తం 119 ప్లాట్లను శ్రీధర్ రావు కొనుగోలు చేయగా, మరో 43ప్లాట్లు యజమానుల వద్ద ఉన్నాయి.
కాగా అత్యధిక ప్లాట్లను కొనుగోలు చేసిన శ్రీధర్ రావు లేఅవుట్ రూపురేఖలు మొత్తం మార్చివేశాడు. లేఅవుట్లో ఉన్న రహదారులు, పార్కులను కబ్జా చేసి వాటిలో భవనాలు నిర్మించాడు. దీంతో పాటు యజమానులకు తమ ప్లాట్ ఎక్కడుందో, ప్లాట్లకు వెళ్లే దారి సైతం లేక ఇబ్బందులు పడ్డారు. దీనిపై అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కాగా శ్రీధర్ రావు అరాచకాలపై ప్లాట్ల యజమానులు గతంలో హైడ్రాను ఆశ్రయించగా, గత మే 7వ తేదీన హైడ్రా అధికారులు ఎఫ్ సీఐ లేఅవుట్లోని పలు నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు లేఅవుట్లో ఉన్న రహదారులకు మార్కింగ్ చేశారు. కాగా అనంతర కాలంలో ప్లాట్ల యజమానులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, శ్రీధర్ రావు తన అనుచరులతో దాడులు చేస్తూ బయపెట్టడంతో పాటు మరోసారి నిర్మాణాలను కొనసాగించసాగాడు. దీంతో ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం హైడ్రా అధికారులు మరోసారి ఎఫ్ సీఐ లేఅవుట్లో నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. లేఅవుట్లోని 40 అడుగుల రోడ్డును ఆక్రమించి చేపట్టిన 4 అంతస్థుల భవనాన్ని, భారీ ఫుడ్ కోర్టును, ప్రధాన రహదారి మీద ఉన్న పెట్రోలు బంకును పాక్షికంగా, 25 అడుగుల రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన 40 ఫుడ్ కంటైనర్లను, ఓ ఆసుపత్రి కోసం నిర్మిస్తున్న భవనం స్లాబ్లను, సంధ్య ఆర్చ్ ను కూల్చివేశారు. ఎఫ్ సిఐ లేఅవుట్లో రహదారులను పూర్తిగా పునరుద్దరిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.
Admin
Ekaburu