Ekaburu - హైదరాబాద్ / రంగారెడ్డి : సంక్షేమానికి మారుపేరు నరేంద్రమోడీ అని, నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా దేశం సమగ్ర అభివృద్ధి పథంలో వయనిస్తుందని చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నానక్ రాంగూడ ఔటర్ రింగురోడ్డు నుంచి మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ బిజెపి శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డితో కలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానక్ రాంగూడలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చేవడుతున్న విజయ సంకల్ప యాత్రల్లో భాగంగా తెలంగాణలో ఐదు యాత్రలు జరుగుతున్నాయని, ఈ యాత్రలకు రాష్ట్రంలోని యువత, ప్రజలు, రైతులు, మహిళలు పెద్దఎత్తున తరలివస్తున్నారన్నారు. దేశంలోని అనగారిన వర్గాల అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనే సాధ్యమవుతుందని దేశ ప్రజలు నమ్ముతున్నారన్నారు.
మోడీ సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిజెపి శాసనసభావక్ష నేత మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రజలకు అవగాహన ఉందన్నారు. దేశ ప్రజలు రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని, రామరాజ్యం కేవలం నరేంద్రమోదీతోనే సాధ్యమని విశ్వసిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపి మరోసారి విజయకేతనం ఎగురవేసి, నరేంద్రమోడీ మూడవ సారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు. నేడు ప్రపంచం మెచ్చిన నాయకుడిగా నరేంద్రమోడీ కీర్తిని అందుకుంటున్నారని, ప్రపంచ దేశాల ముందు భారత్ ను తలెత్తుకునేలా మార్చారన్నారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొవడంతో పాటు ఇతర దేశాలకు వ్యాక్సిన్ ను అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని అన్నారు.
నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ అభ్యర్థి రవికుమార్ యాదవ్, రాజేంద్రనగర్ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల పార్లమెంటు ఇంచార్జ్ మల్లారెడ్డి, ప్రభారి శ్రీనివాస్, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వినర్ రాఘవేంద్రరావు, నాయకులు రవీంద్రరావు, శ్రీధర్ గౌడ్, నవతారెడ్డి, సింధురెడ్డి, బింధు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu