Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ నరేంద్ర మోడీ వేవ్ కనిపిస్తుందన్నారు బిజెపి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ వేర్టెక్స్ ప్రైడ్, వశిష్ట అపార్ట్ మెంట్, కావ్య గ్రీన్ అపార్ట్ మెంట్, వేర్టెక్స్ ప్రెసెంట్, వేర్ టెక్స్ కళ్యాణ్ రెసిడెన్సి, ఎస్సార్ రెసిడెన్సి, జలవాయు విహార్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో ముఖాముఖి పాల్గొని రానున్న ఎన్నికల్లో తనకు ఓటువేసి పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచు కోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ న్యాయబద్ధంగా ఎదుర్కోలేకపోతుందని విమర్శించారు.
Also Read : తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ జెండా : మాజీ కార్పొరేటర్ సాయిబాబా
కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకే ముస్లిం వర్గాల ఓట్లు అధికంగా పోలవుతాయని, కాంగ్రెస్ పార్టీ పచ్చి మతతత్వ పార్టీ అని ఆయన విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తుందని, దాని ద్వారా ఓబీసీలకు నష్టం జరుగుతుందని అన్నారు. ముస్లిం, మైనార్టీ వర్గాల్లోని విద్యావంతులు, మహిళలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, యూపీఏ హయాంలో నష్టపోయిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మోదీ ఆర్థిక విధానాల కారణంగా ఇవాళ లాభాల్లో నడుస్తున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, హరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu